చంద్రబాబు కుట్రలను థీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం-వైయస్ జగన్
చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై బుక్‌లెట్..
అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడుజగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ నిరసన కార్యాచరణకు సంబంధించి, చంద్రబాబు చేసిన మోసం, దగా, ఆయన వెన్నుపోటుకు సంబంధించి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్ రిలీజ్ చేసిన జగన్, గ్రామగ్రామానా, ఇంటింటికీ చేరేలా చూడాలని నిర్దేశించారు. ఇంకా ప్రతి ఒక్క కార్యకర్త వద్ద ఆ బుక్ ఉండాలని, అది డిజిటల్ రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.
రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన:- త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, అన్నీ థీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని జగన్ ఆదేశించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో పార్టీ అధ్యక్షుడు జగన్ సమావేశమయ్యారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యాచరణ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–సర్) కార్యక్రమంపై మాట్లాడిన జగన్, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

