నాసిరకం మందుల చెలామణిపై ఉక్కుపాదం మోపాలి- వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
ఏడాదికి 13వేల నమూనాల సేకరణ జరగాలి..
అమరావతి: నాసిరకం ప్రాణధార మందులను త్వరగా గుర్తించి, వాటి విక్రయాలను నిరోధించడంలో విజయవాడలోని రాష్ట్ర ఔషధ పరీక్ష ప్రయోగాశాల కీలక పాత్ర పోషించబోతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన రాష్ట్ర ఔషధ పరీక్ష ప్రయోగశాల, ఔషధ నియంత్రణ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డ్రగ్ ల్యాబ్స్ అవసాన దశకు చేరుకున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక విశాఖపట్నం, కర్పూలులో కొత్త ల్యాబ్ లను అందుబాటులోకి తెచ్చామన్నారు. విజయవాడలోని ల్యాబ్‌ను రాష్ట్ర స్థాయి ల్యాబ్‌గా తీర్చిదిద్దామన్నారు. గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తోన్నందున, నాణ్యత లేని మందుల చెలామణి క్రమంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. సౌకర్యాలు మెరుగుపరచినందున తనిఖీ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసి నాసిరకం మందుల చెలామణిని పూర్తిస్థాయిలో సకాలంలో ఉక్కుపాదంతో అణగదొక్కాలని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రజారోగ్య సంరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, వారి జీవన ప్రమాణాల్ని మెరుగుపరచేందుకు అధిక ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.

