అన్నదాతల ఖాతాల్లోకి శనివారం సుఖీభవ నిధులు రూ.7 వేలు-సీ.ఎం చంద్రబాబు
2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలివిడత..
అమరావతి: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 45,69,817 మంది భూ యజమాని రైతులు కాగా, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తోన్న RoFR రైతు కుటుంబాలు ఉన్నాయి. రూ.3,125.47 కోట్లను రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా… కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. ఈ ఏడాది తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ చేయనున్నాయి.

