ఇంద్రకీలాద్రిపై వాట్సాప్ ద్వారా దర్శనం, ప్రసాదం టిక్కెట్లు-ఈవో శీనా నాయక్
అమరావతి: ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవి దర్శనానికి విచ్చేసే భక్తులకు క్యూలైన్లలో వేచి ఉండే శ్రమను తగ్గించి, మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం దేవస్థానం సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టిందని భక్తులకు “పూర్తి నగదు రహిత (100% Cashless)” సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్ పేర్కొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం ఆయన దేవస్థాన ఇంజినీరింగ్, ఐటీ (IT), కౌంటర్స్-సెక్యూరిటీ విభాగాల అధికారులు, సిబ్బందితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి,అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్బంగా వాట్సాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసి దర్శనంకు వెళుతున్న భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకున్నారు.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టిక్కెట్లు:– భక్తులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా చాలా సులభంగా సేవలు పొందేలా వాట్సాప్ విధానాన్ని తీసుకువస్తున్నారు. దీని ద్వారా భక్తులు ఇంద్రకీలాద్రి కొండపైకి రాకముందే లేదా కొండపై ఉన్నప్పుడు తమ వాట్సాప్ ద్వారానే
దర్శనం టిక్కెట్లు (Darshan Tickets)
వివిధ సేవా టిక్కెట్లు (Seva Tickets)
లడ్డూ ప్రసాదం టిక్కెట్లు (Prasadam Tickets)
కేశఖండన టిక్కెట్లు (Kalyanakatta Tickets)
మొదలైన వాటిని డిజిటల్ పేమెంట్స్ ద్వారా కొనుగోలు చేసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికరంగా అమ్మవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.
యుద్ధప్రాతిపదికన ‘హెల్ప్ డెస్క్ లు’:- ఆన్లైన్-వాట్సాప్ సేవలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు, డిజిటల్ టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో సహాయపడేందుకు శ్రీ కనకదుర్గ నగర్-ఘాట్ రోడ్డు ‘ఓం’ టర్నింగ్ వద్ద యుద్ధప్రాతిపదికన ప్రత్యేక హెల్ప్ డెస్క్లను (Help Desks) ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు.
సాంకేతిక ఏర్పాట్లు–సిబ్బంది కేటాయింపు:– ఈ హెల్ప్ డెస్క్ ల వద్ద హై-స్పీడ్ ఇంటర్నెట్, క్యూఆర్ కోడ్ (QR Code) స్టాండ్లు, అవసరమైన కంప్యూటర్ సిస్టమ్స్ వంటి సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేయాలని ఐటీ విభాగాన్ని ఆదేశించారు. భక్తులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించేందుకు షిఫ్టుల వారీగా తగినంత మంది సిబ్బందిని ఇక్కడ విధుల్లో కేటాయించాలన్నారు.

