రక్తచరిత్ర రాసేవాళ్లు స్వర్ణాంధ్ర చరిత్ర రాయలేరు-ముఖ్యమంత్రి చంద్రబాబు
మహానాడు సభలో..
అమరావతి: ఎన్నికల కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం పనిచేస్తోన్న పార్టీ తెలుగుదేశం అని… గత పాలకులు రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తే… రెండేళ్లలో రాష్ట్రాన్ని గట్టెక్కించి, వ్యవస్థలను గాడిలో పెట్టి, ఏపీ బ్రాండ్ ఇమేజ్ తిరిగి తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేలా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. పాలనలో అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ముందుకు వెళ్తున్నామన్నారు.

మహిళల సాధికారత, రాష్ట్రానికి పెట్టుబడులు-యువతకు అవకాశాలు, ప్రతీ ఎకరానికి సాగునీరు, అద్భుత రాజధానిగా అమరావతి నిర్మాణం, పేదవారికి సైతం అత్యుత్తమ వైద్యం, అందరికీ చదువు, అసమానతలు రూపుమాపడం, స్వర్ణాంధ్రను సాధించడమే టీడీపీ లక్ష్యమని…ప్రజలు ఇచ్చిన అఖండ విజయానికి సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనతో రుణం తీర్చుకుంటున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా బుధవారం జరిగిన మహానాడు సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు, పార్టీకి దిశా నిర్దేశంతో సీఎం ప్రసంగం సాగింది. రెండు రోజుల పాటు సాగే వర్చువల్ మహానాడుకు భారీ స్పందన వచ్చింది. మహానాడు ప్రారంభ సమయంలోనే భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.1,864 క్లస్టర్ల నుంచి దాదాపు 2.23 లక్షల మంది మహానాడు కార్యక్రమానికి హాజరయ్యారు.

