యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్ గా నిలుస్తుంది-రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
మరిన్ని డిఫెన్స్ ప్రాజెక్టులు-చంద్రబాబు..
అమరావతి: ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధరంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో రూ.480 కోట్లతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.శుక్రవారం పుట్టపర్తిలో రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం చంద్రబాబులు యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లతో AMCA ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. పుట్టపర్తి – కోడూరు రోడ్డులోని 130 ఎకరాల విస్తీర్ణంలో డిఫెన్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ ఆర్థిక, వ్యవసాయ శాఖల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఆయుధ ఉత్పత్తిలో స్వావలంబన దిశగా భారత్ అధ్యయనం చేస్తోందని,రక్షణ శాఖలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనేది కేంద్ర లక్ష్యమని తెలిపారు.గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య అంతరం తగ్గించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. డ్రోన్ హబ్‌గా కర్నూలు ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని రక్షణ శాఖమంత్రి స్పష్టం చేశారు.

ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు:- అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా మారుతోందన్నారు. AMCA ప్రాజెక్టు ద్వారా భారత్ ఆత్మనిర్భర్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. AMCA ప్రాజెక్టును ఏపీకి కేటాయించినందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్‌తో పాటు ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రంగా పుట్టపర్తి అభివృద్ధి చెందుతుందన్నారు. కేవలం 36 రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగలిగామని.. జెట్ స్పీడ్‌తో అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ఈ కీలక ప్రాజెక్టుతో మరిన్ని డిఫెన్స్ ప్రాజెక్టులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఫోర్జ్, హెచ్ఎఫ్సీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లాంటి సంస్థలకు సంబంధించి కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

