బెంగాల్ లో SIR విధి నిర్వహణల్లో వున్న న్యాయాధికారులను నిర్బంధిస్తారా-సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
అమరావతి: SIR విధి నిర్వహణల్లో భాగంగా పశ్చిమబంగాల్లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని ధర్మాసనం అభివర్ణించింది. బంగాల్‌లో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని,, ఈ సంఘటనపై తగిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నోటీసులు జారీ చేశారు. ముగ్గురు మహిళలతో సహా ఏడుగురు న్యాయాధికారులను కొన్ని అసాంఘిక శక్తులు నిర్బందించాయని, అర్థరాత్రి వరకు తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాల్సి వచ్చిందని సీజేఐ వెల్లడించారు.
ఇది న్యాయాధికారులను భయపెట్టడమే కాకుండా కోర్టు అధికారాన్ని నేరుగా సవాలు చేయడమేనని ధర్మాసనం పేర్కొంది. న్యాయాధికారులపై మానసిక దాడులకు పాల్పడేందుకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ కోరేందుకు ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ మాల్డా జిల్లాలో ఆందోళనకారులు బుధవారం ఆందోళనకు దిగారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కావాలని నిరసనకారులు కోరారు. అందుకు అనుమతి నిరాకరించడంతో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కార్యాలయం చుట్టూ చేరి అధికారులను నిర్బంధించారు

