మూడు రోజులు రాజకీయాలు పక్కనపెట్టి క్రీడలకే ప్రాధాన్యతనివ్వాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ‘ఆటవిడుపు’ క్రీడా కార్యక్రమాలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, నిత్యం ప్రజలతో, రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు బయటకు వెళ్లినా, ఇంటికి వెళ్లినా, అసెంబ్లీలో ఉన్నా నిరంతరం టెన్షన్ వాతావరణమే ఉంటుందని, ఈ ఒత్తిడి నుంచి ప్రశాంతత పొందేందుకు ఇలాంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
ప్రజలు కూడా స్టేడియానికి రావచ్చు:- ప్రస్తుతం సభలో 78 శాతం మంది యువఎమ్మెల్యేలు ఉన్నారని, వారి ఉత్సాహాన్ని చూసి క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనేలా వయసుల వారీగా విభజించామని తెలిపారు. ఈ ‘ఆటవిడుపు’ కార్యక్రమానికి శాప్, పోలీస్ శాఖ, ఇతర అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని అభినందించారు. ఈ మూడు రోజుల పాటు జరిగే క్రీడలను వీక్షించేందుకు ప్రజలు కూడా స్టేడియానికి రావచ్చని ఆయన ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులు ఆడుతున్నప్పుడు మీడియా కూడా ఈ మూడు రోజులు రాజకీయాలను పక్కనపెట్టి క్రీడలకే ప్రాధాన్యతనిచ్చి వార్తలు ప్రచురించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను కోరారు.

