అవగాహనతోనే మూర్చ వ్యాధిని అరికట్టవచ్చు-కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: మూర్ఛ వ్యాధిపై అవగాహన కల్పించి, మూర్ఛ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం చింతారెడ్డిపాలెంలోని నారాయణ మెడికల్ కళాశాలలో మూర్ఛ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులుగా సమాజానికి సేవ చేసే భాగ్యం దక్కడం గొప్ప అదృష్టమని, ఈ అవకాశాన్ని సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలని వైద్య విద్యార్థులకు కలెక్టర్ ఉద్భోదించారు. రోగులకు మానవత్వంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. మూర్ఛ అనేది నర వ్యవస్థకు సంబంధించిన వ్యాధి మాత్రమే గానీ, శాపం కాదని, అంటువ్యాధి కాదన్నారు. సరైన చికిత్స, క్రమమైన మందుల వినియోగంతో మూర్ఛను నియంత్రించి సాధారణ జీవితం గడపవచ్చని తెలిపారు. మూర్చ వ్యాధిపై అవగాహన పెంచి, అపోహలు తొలగించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
మూర్చ వ్యాధిగ్రస్తులకు అండగా:- పాఠశాలలు, కార్యాలయాలు, ప్రజా సంస్థలు సమావేశక వాతావరణాన్ని కల్పించాలని, అలాగే మూర్చ వ్యాధి తొలి దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించేలా ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, యజమానులు, స్థానిక సంస్థలు అందరూ భాగస్వాములై మూర్చ వ్యాధిగ్రస్తులకు అండగా ఉండాలని సూచించారు. తొలుత నారాయణ మెడికల్ కళాశాల వారు మూర్చ వ్యాధికి సంబంధించి ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ 18004240060 నెంబర్ గల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కళాశాల డీన్ శ్రీనివాసరెడ్డి, న్యూరాలజీ హెచ్ ఓ డి ఎన్ఎస్ సంపత్ కుమార్, ఆర్ బిజు, ప్రభావతి, ఆర్ హరీష్ బాబు, రమణ రావు,శేఖర్ రెడ్డి, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

