రాష్ట్రవ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్‌మిల్ అవుట్‌లెట్లలో విక్రయాలు ప్రారంభం-మంత్రి మనోహర్
రూ.52కే నాణ్యమైన సన్న బియ్యం..
రూ.50 కే బీపీటీ రా బియ్యం..
ఒక్క కుటుంబానికి 10 కిలోల వరకు..
అమరావతి: రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పౌర సరఫరాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విజయవాడలోని ఏపీఐఐసీ (APIIC) కాలనీ లో గల రైతు బజార్‌లో శాసన సభ్యులు గద్దె రామమోహన్, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు.అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ, ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తో సమన్వయం చేసుకుని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రూ.52 కే బీపీటీ స్టీమ్ రైస్– గతంలో కిలో రూ.64–65 వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్‌ను ప్రస్తుతం కేవలం రూ.52 కు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఒక్క కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
రూ.50 కే బీపీటీ రా బియ్యం– అదేవిధంగా గతంలో కిలో రూ.58–60 వరకు ఉన్న బీపీటీ రా (పచ్చి) బియ్యాన్ని రూ.50 కు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రాయితీ ధరల విక్రయాలు రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
150 రైతు బజార్లు.. 500 రైస్‌మిల్ అవుట్లెట్లు– రాష్ట్రంలోని 150 రైతు బజార్లు, 500 రైస్‌మిల్ అవుట్‌లెట్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండటంతో పాటు బహిరంగ మార్కెట్‌లో ధరలపై నియంత్రణ ఏర్పడేలా ఈ చర్య దోహదపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి తెలిపారు. వినియోగదారులపై నిత్యావసర వస్తువుల ధరల భారం పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

