NATIONAL

100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం వేడుకల నాటికి వికసిత్ భారతదేశంగా వికసించాలి-ప్రధాని మోదీ

గత 12 ఏళ్లలో దేశం అనేక రంగాల్లో గణనీయమైన మార్పు..

అవసరాలను దేశీయంగానే తీర్చుకునే సామర్థ్యం..

100 గిగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తి..

భారత్‌ పట్ల ప్రపంచ దేశాల దృకపథం మారింది..

సంక్షోభాలను ఆవకాశలుగా మలుచుకున్నాం..

ఎర్రకోట వేడుకల్లో తొలిసారిగా పూర్తి ‘వందే మాతరం’..

అమరావతి: దేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంత సామర్థ్యాలను పెంచుకోవడం, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం ద్వారా ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ‘వందే మాతరం’ నినాదం మార్మోగుతోందని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని మోదీ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

గత 12 ఏళ్లలో దేశం అనేక రంగాల్లో గణనీయమైన మార్పును సాధించిందని తెలిపారు.గత 70 పంవత్సరాల్లో  సాధించలేకపోయిన లక్ష్యాలను రానున్న 5-7 ఏళ్లలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆలోచనా విధానంలోనూ, లక్ష్యాల సాధనలోనూ సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.140 కోట్ల మంది భారతీయుల సంకల్పం, సామర్థ్యమే దేశానికి అతిపెద్ద బలమన్నారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌’:- భారత్‌ ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడాలని,అదే సమయంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘స్వదేశీ’, ‘లోకల్‌ ఫర్‌ లోకల్‌’ కార్యక్రమాలకు ప్రజలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. దేశ అవసరాలను దేశీయంగానే తీర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

100 గిగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తి:- సెమీకండక్టర్‌ రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత్‌ కీలక అడుగులు వేస్తోందని,ఇప్పటికే మూడు సెమీకండక్టర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశ ఇంధన భద్రతకు అణుశక్తి కీలకమని ప్రధాని పేర్కొన్నారు.2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ దశాబ్దంలో ఐదు కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

భారత్‌ పట్ల ప్రపంచ దేశాల దృకపథం మారిందని, గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోందని ప్రధాని అన్నారు. స్థిరమైన రాజకీయ వ్యవస్థ, బలమైన ప్రభుత్వం, చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం దేశ బలానికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు. 2014 నుంచి దాదాపు 40 దేశాలతో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు,వాణిజ్య భాగస్వామ్యాలు కుదుర్చుకుందని తెలిపారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాల ద్వారా దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs) భారీ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.

సంక్షోభాలను ఆవకాశలుగా మలుచుకున్నాం:- కరోనా మహమ్మారి, యుద్ధాలు, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అనేక సవాళ్లు ఎదురైనా భారత్‌ తన అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించిందని మోదీ అన్నారు. ఒకప్పుడు ‘ఫ్రాజైల్‌ ఫైవ్‌’ దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో రక్షణ ఉత్పత్తి దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు ఐదు రెట్లు పెరిగిందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలోనూ భారీ వృద్ధి సాధించామని చెప్పారు.

ఎర్రకోట వేడుకల్లో తొలిసారిగా పూర్తి ‘వందే మాతరం’:- స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం, ప్రతి మనసులో దేశభక్తి ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు నివాళులర్పిస్తూ.. వారి కలలను సాకారం చేసే దిశగా ప్రతి భారతీయుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎర్రకోట వేడుకల్లో తొలిసారిగా పూర్తి ‘వందే మాతరం’ గీతం ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని వివిధ వర్గాలకు చెందిన దాదాపు 5,000 మంది ప్రత్యేక అతిథులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *