భోగాపురం ఎయిర్‌పోర్ట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యం,,
అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు ఉన్నారు. రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ను నిర్మించారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్‌ను ప్రధాని పరిశీలించారు.
ఈ వీడియో వాల్‌లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చరిత్రాక అంశాలను ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను మోదీ ఆసక్తిగా పరిశీలించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, GMR ప్రతినిధులు ఫొటో దిగారు. ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వీక్షించారు. ఓపెన్ టాప్ జీపులోనే సభా వేదిక వద్దకు నేతలు వెళ్లారు. బహిరంగ సభావేదికపై ప్రధాని మోదీకి బొబ్బిలి వీణను సీఎం చంద్రబాబు బహూకరించారు.

