ముగిసిన “ద్రవిడ రాజకీయ” శకం – ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం
అమరావతి: తమిళనాడు రాజకీయాల్లో,ఇప్పటి వరకు DMK, AIADMK పార్టీలు చేస్తూన్న “ద్రవిడ రాజకీయ” శకం ముగిసి,,సరికొత్త అధ్యాయం ప్రారంభం అయింది. ప్రముఖ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత సి.జోసెఫ్ విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన అట్టహాసమైన వేడుకలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. TVK పార్టీకి వచ్చిన 107 సీట్లతో పాటు VCK, IUML వంటి పార్టీల మద్దతుతో మేజిక్ ఫిగర్ 118 దాటి, 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అవినీతి లేని పాలనను అందిస్తా:- ప్రమాణ స్వీకారం అనంతరం జోసెఫ్ విజయ్ తమిళనాడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ,రాష్ట్రంలో పారదర్శకమైన, అవినీతి లేని పాలనను అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మహిళల రక్షణ,సంక్షేమానికి తన ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ,పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్.ఆనంద్, ఆదవ అర్జున, కె.ఎ.సెంగోటియన్, ఎస్. కీర్తన, కె.జి. అరుణ్ రాజ్, పి. వెంకటరమణన్, సి.ఆర్. నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, టి.కె. ప్రభులు ఉన్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం అనంతరం మూడు హామీలపై సంతకాలు చేశారు. తొలి సంతకం ఉచిత విద్యుత్ పథకంపై చేశారు. దీంతో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్,రెండో సంతకం మహిళ భద్రత,మూడో సంతకం యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఫైలుపై పెట్టారు.

