ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతానికి జేజేఎం-అమరజీవి జలధారలు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో..
130 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తి..
శరవేగంగా సాగుతున్న రూ.2,370 కోట్ల పనులు..
18 మండలాలు, 3,163 ఆవాసాలకు..
అమరావతి: అత్యంత తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన తాగు నీటి ప్రాజెక్టుల పనులు వారాంతపు లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఏడాది చివరినాటికి పూర్తి చేయాల్సిన లక్ష్యాలను నెలవారీ, వారాల వారీగా విభజించుకుని, ఎప్పటికప్పుడు పూర్తికావాల్సిన పనులపై సమీక్షించుకోవాలని స్పష్టం చేశారు. తద్వారా వేగంగా నిర్మాణం పూర్తి చేసి, గడువులోపు ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధారల కింద రూ.2,370 కోట్లతో చేపట్టిన చిత్తూరు మల్టీ విలేజ్ స్కీమ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్‌లైన్ నిర్మాణం కోసం వివిధ శాఖల నుంచి పొందాల్సిన అనుమతులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందాలి. ప్రతి గొంతు దాహార్తి తీరాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జల్ జీవన్ మిషన్ సంకల్పాన్ని అమరజీవి జలధారలుగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అత్యంత నీటి ఎద్దడి కలిగిన ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు.
130 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తి:- ఏడు నీటి సంపులు, ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు, 14 గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితర 167 పనులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 130 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం కూడా పూర్తయ్యింది. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద పనుల్లో నాణ్యతా లోపాలు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

