పార్టీ కాదు.. ప్రాంతం కాదు.. ప్రజలే ముఖ్యం- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదు ..
ప్రతి ఇంటికీ సురక్షిత నీరు..
రూ.30,156 కోట్లతో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం..
పులివెందులకు రూ.280 కోట్లుతో..
299 గ్రామాల తాగు నీటి సమస్యకు పరిష్కారం..
3.27 కోట్ల మందికి సురక్షిత తాగునీరు..
కడప: తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావు లేదని, అభివృద్ధి విషయంలో ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ విధానమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రత కల్పించడమే ‘అమరజీవి జలధార’ లక్ష్యమని తెలిపారు. సోమవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి రూ.30,156 కోట్ల విలువైన తాగునీటి పనులకు శంకుస్థాపన చేశారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్:- ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన నేల. మహాత్మా గాంధీ నడయాడిన నేల. తెలుగు సాహిత్య్యాన్ని తన అక్షరాలతో సుసంపన్నం చేసిన సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులకు జన్మనిచ్చిన నేల ప్రొద్దుటూరు. బంగారం, వస్త్ర వ్యాపారంలో మినీ ముంబై గా, దసరా ఉత్సవాల్లో రెండో మైసూరు గా ప్రొద్దుటూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
రూ.30,156 కోట్లతో భారీ తాగు నీటి ప్రణాళిక:- రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ.30,156 కోట్లతో 50,315 పనులను శ్రీకారం చుడుతున్నాం. 2019-24 మధ్య కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు రూ.26 వేల కోట్లు అందించినప్పటికీ, గత ఐదేళ్లలో రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, అక్కడక్కడ పైపులైన్లు, చిన్నచిన్న పనులు చేసి వదిలేశారు. 2024తో పథకం గడువు ముగుస్తుందని, నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని, ప్రజల తాగునీటి కష్టాలు ఎప్పటికీ తీరవని తెలిసినా కూడా పట్టించుకోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, జల్ జీవన్ మిషన్‌ను కొనసాగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేశాము. అలాగే, కేంద్ర జలశక్తి మంత్రివర్యులు సి.ఆర్. పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ సహకారంతో జలజీవన్ మిషన్ పథకాన్ని 2028 వరకు పొడిగించుకుని, వెంటనే పనులు ప్రారంభించాం. ఇప్పటికే రూ.4,500 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాము.
తాళ్లమాపురానికి రూ.3.5 కోట్ల అభివృద్ధి పనులు:- ప్రొద్దుటూరు నియోజక వర్గంలోని తాళ్లమాపురం పంచాయతీ ప్రజలు గత ప్రభుత్వ హయాంలో తమ సమస్యల పరిష్కారం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 6 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో రోడ్లు, తాగు నీరు వంటి కనీస మౌలిక వసతుల కోసం ప్రజలు పలుమార్లు వినతులు సమర్పించినా, తగిన స్పందన లభించలేదనే ఆవేదన ఉంది. సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువత కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇకపై ఇలాంటి పరిస్థితులకు తావులేకుండా తాళ్లమాపురం, సాగిలి గొడ్డుపల్లి, ములవారిపల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు రూ.1.5 కోట్లతో రెండు కిలోమీటర్ల సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడంతో పాటు, మరో రూ.2 కోట్లతో 90 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్‌హెడ్ రిజర్వాయర్, నాలుగు కిలోమీటర్ల పైప్‌లైన్లు, ప్రత్యేక బోర్‌వెల్ ఏర్పాటు చేయనున్నాం. మొత్తం రూ.3.5 కోట్ల విలువైన ఈ పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నాను. అంతకు ముందు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ర్యాంప్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కలిసి నడుస్తూ సభకు తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేశారు.

