NATIONALOTHERSTECHNOLOGY

మరో చారిత్రక విజయాన్ని అందుకున్న ఇస్రో-GSLV F17 ప్రయోగం విజయవంతం

ESO-05 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి..

అత్యంత క్లిష్టమైన స్వదేశీ క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌..

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చారిత్రక విజయాన్ని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి శుక్రవారం తెల్లవారుజామున చేపట్టిన GSLV F17  ప్రయోగం విజయవంతమైంది.  ఈ వాహకనౌక ద్వారా 2,367 కిలోల బరువున్న ESO-05 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి కచ్చితత్వంతో ప్రవేశపెట్టారు. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణతో పాటు వ్యవసాయం, పర్యావరణ పర్యవేక్షణ వంటి రంగాల్లో ఈ ఉపగ్రహం కీలక సేవలు అందించనుంది.

శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV-F17 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 3.13 గంటలకు ESO-05 ఉపగ్రహాన్ని సబ్‌-జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (సబ్‌-జీటీఓ)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ కక్ష్యలో పెరీజీ 170 కిలోమీటర్లు, అపోజీ 28,934 కిలోమీటర్లుగా ఉంది. సుమారు 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న GSLV సిరీస్‌లో ఇది 19వ ప్రయోగం.

స్వదేశీ క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌:- GSLV-F17 మూడు దశల ప్రయోగ వాహకనౌక. ఇందులో అత్యంత క్లిష్టమైన స్వదేశీ క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌ సమర్థంగా పనిచేయడం ప్రయోగ విజయానికి కీలకంగా నిలిచింది.ఉపగ్రహాన్ని తొలుత సబ్‌-జీటీఓలోకి ప్రవేశపెట్టగా, అనంతరం ఉపగ్రహంలోని ఆన్‌బోర్డ్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ సాయంతో దాన్ని తుది జియోస్టేషనరీ కక్ష్యలోకి చేర్చే ప్రక్రియ కొనసాగింది.

2021 ఆగష్టులో GSLV-F10 ద్వారా ప్రయోగించిన GSAT-1 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యను చేరుకోలేకపోయింది.ఆ వైఫల్యానికి ప్రత్యామ్నాయంగా మరింత మెరుగైన సాంకేతికతతో రూపొందించిన ESO-05ను ఇప్పుడు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇస్రోకు ప్రత్యేక విజయంగా నిలిచింది.

సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించడం, కీలక ప్రాంతాల్లో మార్పులను గుర్తించడం వంటి రక్షణ అవసరాలకు ఉపగ్రహం నుంచి అందే చిత్రాలు ఉపయోగపడనున్నాయి. అలాగే వరదలు, తుపాన్లు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభావిత ప్రాంతాలను వేగంగా గుర్తించేందుకు ఈఓఎస్‌-05 డేటా దోహదపడనుంది. సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్లు, అత్యవసర ప్రణాళికలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.

సహజ వనరుల పరిస్థితిని దీర్ఘకాలం:- పంటల పరిస్థితి, సాగు విస్తీర్ణం, భూమిలో తేమ, నీటి వనరులు వంటి అంశాలను పర్యవేక్షించేందుకు భూ పరిశీలన ఉపగ్రహాల డేటా కీలకం. ఈఓఎస్‌-05 నుంచి లభించే సమాచారాన్ని వ్యవసాయ ప్రణాళికలు, నీటి నిర్వహణ, పంటల అంచనాల్లో ఉపయోగించవచ్చు. అలాగే అడవుల విస్తీర్ణంలో మార్పులు, పట్టణ ప్రాంతాల విస్తరణ, భూ వినియోగంలో మార్పులు, సహజ వనరుల పరిస్థితిని దీర్ఘకాలంగా పర్యవేక్షించేందుకు కూడా ఈ ఉపగ్రహం దోహదపడనుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *