వెనెజువెలా భూకంపాల బాధితులను ఆదుకునేందుకు భారీ సాయం పంపిన భారత్
అమరావతి: రెండు రోజుల క్రిందట వెనెజువెలాలో సంభవించిన భూకంపాలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ విషాదంలో వున్న వెనెజువెలాను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ అమిస్టాడ్‌ను (స్పానిష్ భాషలో అమిస్టాడ్ అంటే స్నేహం) ప్రారంభించింది. బాధితులను ఆదుకునేందుకు వీలుగా ఒక ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌తో పాటు ఇతర సహాయక సామగ్రిని రెండు సీ17 ట్రాన్స్ పోర్టు విమానాల్లో పంపించింది. మొత్తం 35 టన్నుల సామగ్రిని పంపించామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే తొలిదేశంగా భారత ప్రతిష్ఠ ఈ ఆపరేషన్‌తో ఇనుమడించిందని అన్నారు. క్షతగాత్రులకు వైద్యసాయం సాయం అందించేందుకు ఆర్మీ ప్రత్యేక మెడికల్ బృందాన్ని ఇప్పటికే పంపించామని భారత ఆర్మీ తెలిపింది. పారాఫీల్డ్ ఆర్మీకి చెందిన 41 మంది మెడికల్ సిబ్బంది ఉన్నారని,అలాగే వీరిలో 9 మంది మెడికల్ ఆఫీసర్లు కూడా ఉన్నారని వెల్లడించాయి. వెనెజువెలాలో ఈ బృందం ఎమర్జెన్సీ వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి క్షతగాత్రులకు వైద్యం అందిస్తుంది. ట్రామా మేనేజ్‌మెంట్, ఎమర్జెన్సీ సర్జరీల వంటి క్రిటికల్ వైద్య సేవలు అందించడం ఈ బృందం ప్రత్యేకత అని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

