ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు తృటిలో పెను ప్రమాదం
అమరావతి: సిరియా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ బస చేస్తున్న హోటల్ సమీపంలో, డమాస్కస్ నగర నడిబొడ్డున మంగళవారం రెండు శక్తి వంతంమైన కారు బాంబులు పేలడంతో, నలుగురు పోలీసు అధికారులు మరో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన నుండి అధ్యక్షుడు మాక్రాన్ సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ సంఘటనలో మాక్రాన్ సురక్షితంగా ఉన్నారని, పేలుళ్ల తర్వాత కూడా ఆయన తన పర్యటనను యథావిధిగా కొనసాగించారని ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ప్రకటించింది.
ఫోర్ సీజన్స్ హోటల్ సమీపంలో పార్క్ చేసిన కారులో ఒకటి, దానికి కొంచెం దూరంలో ఉన్న చెత్తబుట్టలో మరొకటి ఉంచిన పేలుడు పరికరాలను భద్రతా దళాలు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుండగా పేలిపోయాయి. పేలుళ్ల అనంతరం అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతానికి వెళ్లే రహదారులను మూసివేసి భద్రతను కట్టుదిట్టంచేశారు.పేలుళ్లు జరిగిన సమయంలో మాక్రాన్ తన కాన్వాయ్‌లో వేరే కార్యక్రమానికి వెళుతున్నారని, ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పష్టంచేసింది.
ఈ సంఘటన జరిగినప్పటికీ మాక్రాన్ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు.2024లో బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని కూలదోసిన తరువాత, ఒక యూరోపియన్ యూనియన్ దేశాధినేత సిరియాలో పర్యటించడం ఇదే తొలిసారి.

