నగరపాలక సంస్ధ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృపాకర్ ను సస్పెండ్ చేసిన కమిషనర్
నెల్లూరు: నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పూర్తిస్థాయి ప్రక్షాళన చేపడుతున్నామని, గతంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని కమిషనర్ సూర్యతేజ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని “నివా హాస్పిటల్” పూర్తిస్థాయిలో ప్రారంభమై, వైద్య సేవలను కొనసాగుతున్నప్పటికీ ఆస్తి పన్ను విధించకపోవటాన్ని గత తనిఖీల్లో కమిషనర్ గుర్తించి భవన యజమానులకు నోటీసులను అందజేశారు.. నోటీసులకు స్పందించిన హాస్పిటల్ నిర్వాహకులు అప్పటి స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ K.కృపాకర్ సూచనల మేరకు తాము ఆస్తి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఇప్పటివరకు చెల్లించలేదని, అతను సూచించిన విధంగా నడుచుకున్నామని లిఖితపూర్వక వివరణ ఇచ్చారు..వారు ఇచ్చిన వివరణ ఆధారంగా ప్రస్తుతం సానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కృపాకర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అప్పటి సంబంధిత రెవెన్యూ అధికారులు శ్రీనివాసులు, రాజేశ్వరీలకు నోటీసులు ఇచ్చి, వివరణ ఇవ్వాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.