రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి-కలెక్టర్ వెంకటేశ్వర్
డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు..
తిరుపతి: ఈనెల డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు, డిసెంబర్ 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గురువారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు.. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకూ 33 రోజులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, 2017 తర్వాత నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి జనవరి 7న రెవెన్యూ శాఖ మంత్రి జిల్లాకు రానున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలలోని రెవెన్యూ సంబంధిత, భూములకు, కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, సర్వే సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశలో ఒక నిర్దేశిత ప్రణాళికతో రెవెన్యూ సదస్సులను నిర్వహించడానికి షెడ్యూల్ తయారు చేశామని పేర్కొన్నారు.
అర్జీలకు ఎలాంటి రుసుం లేదు..రెవెన్యూ సదస్సు నిర్వహించే రోజున వచ్చే అర్జీలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని,, ఉదాహరణకు సర్వే, అడంగల్, 1-B రికార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, మ్యుటేషన్, పేరు సవరణ తదితర పత్రాలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ రోజు మినహా మిగిలిన రోజులలో వచ్చే అర్జీలకు నిర్దేశిత రుసుములు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా స్వీకరించే ఫిర్యాదులన్నిటినీ రియల్ టైమ్ గవర్నెస్ సొసైటీ (RTGS) రూపొందించిన గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్లోని ప్రత్యేక విండోలో ఆన్‌లైన్లో నమోదు చేయడం జరుగుతుందని, రసీదు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. స్మశాన వాటికలకు స్థలాలు, దారి సమస్యలు వంటి తదితర సమస్యలు, 22 ఎ కేసుల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులలో అర్జీలు రాయడానికి రాని వారి కొరకు ప్రత్యేకంగా అర్జీలు రాసేందుకు ఏర్పాటు చేస్తున్నామని, సదరు సదస్సులను ఫలవంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు..ఈ సమావేశంలో J.C శుభం బన్సల్,, DRO నరసింహులు, DEO కుమార్, జిల్లా సర్వే అధికారి అరుణ్ కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.