మీరు బాగా వ్యాపారాలు చేసుకొండి,సంపాదించుకొండి-మంత్రి నారాయణ
ట్యాక్స్ లు మాత్రం కట్టండి.
నెల్లూరు: నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు నోటీసులు ఇస్తే వైసీపీ నేతలు రోడ్డెక్కి ధర్నాలు చేయడం హస్యస్పదం అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం చేసే డ్రామాలను జనం నమ్మరని,అన్ని విషయాలు గమనిస్తుంటారు అన్న సంగతి వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.సోమవారం వైసీపీ ఎమ్మేల్సీ చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన కృష్ణచైతన్య విద్యాసంస్థలకు అధికారులు నోటీసులు ఇవ్వడంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు. అసలు ఆ నోటీసుల వ్యవహారం తనకు తెలియనే తెలియదని, మొన్న భీమవరంలో నారాయణ విద్యాసంస్థలకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆ విషయాన్ని తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెబితేనే తనకు తెలిసిందని వెల్లడించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలి తప్ప రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్షగట్టి నారాయణ గ్రూప్స్ ను రకరకాలుగా వేధించారన్నారు.అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేరుగా వచ్చి ఆందోళన చేసినా తాము ఓపిక పట్టి అధికారుల క్లియరెన్స్ తెచ్చుకున్నామే తప్ప రాజకీయం చేయలేదని గుర్తుచేశారు. మీలా లబ్ధి పొందాలనుకుంటే అప్పట్లో రోజుకో ఆందోళన చేసేవాళ్లమన్నారు. మీరు బాగా వ్యాపారాలు చేసుకొండి,బాగా సంపాదించుకొండి అయితే ప్రభుత్వానికి ట్యాక్స్ లు మాత్రం కట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం వ్యాపారస్తులను, విద్యాసంస్థలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టదని, ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించదని, తప్పు ఎక్కడ జరిగినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

