మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం-వాతావరణశాఖ
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు వానలు కురవనున్నట్లు వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది.
గురువారం రాత్రికి శ్రీకాకుళం జిల్లాలో(రెడ్ అలెర్ట్) కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
శుక్రవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ,పశ్చిమగోదావరి, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని,ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

