రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై 32 ఆజెండా అంశాలతో సీ.ఎం చంద్రబాబు అధ్యక్ష్తతన కేబినేట్ సమావేశం
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని అమరావతి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు తదితర అంశాలు ప్రధాన అజెండాగా ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. అమరావతి నిర్మాణం, పారిశ్రామికాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కొత్త చట్టాలతో పాటు పెండింగ్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. విద్యా, వైద్య రంగాలు సహా రహదారి భద్రత, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. మంత్రివర్గ సమావేశం 32 అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది.
ఆక్వా రంగం, పారిశ్రామిక విప్లవం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్–2026, ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదాలకు ఆమోదం తెలిపారు. పరిపాలనా, చట్టపరమైన సంస్కరణలలో భాగంగా ఏపీ దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించి కొత్త కఠిన చట్టాలను తీసుకురావాలని నిర్ణయించారు. పారిశ్రామిక వేగానికి బల్క్ డ్రగ్ పార్క్ కోసం హుడ్కో నుంచి 680 కోట్ల రూపాయల రుణం, ఆక్వా రంగానికి యూనిట్‌కు రూపాయిన్నర విద్యుత్ రాయితీని కొనసాగించనున్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు మున్సిపల్ భూముల లీజు గడువును 25ఏళ్లకు పైగా పెంచేలా చట్టసవరణలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రెయిన్ (పాదాచారులు) సేఫ్టీ అండ్ యునివర్సల్ ఆక్సెస్బిలిటీ పాలసీ -2026ను, దాని ఆపరేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.ఈ పాలసీ ప్రకారం పాదచారుల మరణాలను పూర్తిగా నివారించే లక్ష్యంతో జీరో టాలరెన్స్ విధానం అమలు చేసి, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించి అవరోధరహిత, సురక్షిత పాదచారి మార్గాలను ఏర్పాటు చేయాలి.కేబినేట్ తీసుకున్న నిర్ణాలను మంత్రి పార్దసారథి మీడియాకు వివరించారు.

