విశాఖపట్నంలో కీలక పారిశ్రామిక సంస్థలను సందర్శించిన సీఐఎస్ఎఫ్ డీజీ ప్రవీర్ రంజన్
అమరావతి: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్,IPS ఆగస్టు 15, 16 తేదీల్లో విశాఖపట్నంలోని కీలక పారిశ్రామిక సంస్థలను సందర్శించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన DG భద్రతా, కార్యాచరణ సన్నద్ధతను సమీక్షించారు.RINL CMD ప్రభాకర్, ఉన్నతాధికారులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కీలక సంస్థ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. విశాఖపట్నం పోర్టును సందర్శించిన ఆయన కీలక భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత, శిక్షణ, కార్యాచరణ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్మన్ జస్మీత్ సింగ్ బింద్రా, ఐఆర్‌టీఎస్, డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి కొరటి, ఐఏఎస్‌లతో పోర్టు భద్రత, సీఐఎస్ఎఫ్–పోర్ట్ అథారిటీ సమన్వయంపై చర్చించారు.
తొలి మహిళా కమాండోల బ్యాచ్:- విశాఖపట్నంలో పనిచేస్తున్న అన్ని సీఐఎస్ఎఫ్ యూనిట్ల సంయుక్త సైనిక్ సమ్మేళనంలో డీజీ ప్రసంగించారు. భవిష్యత్ భద్రతా వ్యూహాలు, సాంకేతిక ఆధునీకరణ, కార్యాచరణ సన్నద్ధత, క్రమశిక్షణతో పాటు సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మహిళా సిబ్బంది సీఐఎస్ఎఫ్‌లో అందిస్తున్న సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. సీఐఎస్ఎఫ్ 10వ రిజర్వ్ బెటాలియన్‌లో శిక్షణ పొందిన తొలి బ్యాచ్ మహిళా కమాండోల విజయాలను అభినందించారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్, పోలీస్ గేమ్స్ లో సీఐఎస్ఎఫ్ మహిళా బృందం కనబరిచిన ప్రతిభను కూడా కొనియాడారు.దేశంలోని కీలక ఆస్తులు, అత్యంత ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యానికి సీఐఎస్ఎఫ్ కట్టుబడి ఉందని డీజీ పర్యటన మరోసారి స్పష్టం చేసింది.

