ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
12 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర..
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం 12 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించిందన్నారు. రూ.20.62 కోట్లతో APHIMS ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ తో 72 నెలల పాటు అమలు చేయనున్నట్లు తెలిపారు. సేవలో ఉండగానే మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రతి ఏడాది సేవకు రూ.5 వేల చొప్పున.. గరిష్ఠంగా రూ.1.50 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
తల్లికి వందనం-68,57,880 మందికి ఈ పథంకం:- రేపల్లె 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్, రేపల్లె ఏరియా ఆసుపత్రి అప్‌గ్రేడేషన్‌కు రూ.58.42 కోట్లు, అదనంగా 66 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. 2026-27 తల్లికి వందనం మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులు ఇవ్వడంతో, అదనంగా 58,060 మందితో కలిపి ఆర్థిక సాయం విడుదలకు ఆమోదం తెలిపిందని, దీంతో 68,57,880 మందికి ఈ పథంకం వర్తించనున్నట్లు చెప్పారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ ఛార్జీల పెంపుపై ఉత్తర్వులకు ఏపీ మంత్రివర్గం రాటిఫికేషన్ ఇచ్చిందన్నారు.
ప్రైవేట్ యూనివర్సిటీల కొత్త పాలసీ:- విశాఖ మరికవలసలో గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, IIT-JEE, NEETకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ కేంద్రం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు. అలాగే ప్రకాశం జిల్లా కొండపిలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ కోసం 7 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ విద్యా చట్టం–1982కు సవరణలు చేసే ప్రతిపాదనకు, విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు కొత్త పాలసీ–2026కు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం ఇచ్చిందన్నారు.అలాగే విదేశీ విద్యాసంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటు, ప్రోత్సాహకాలు, సదుపాయాలపై సమగ్ర విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా పదవీకాలం పూర్తిచేసినందుకు ఏపీ కేబినెట్ ముఖ్యమంత్రి నేతృత్వంలో తీర్మానం చేశామన్నారు.

