చదువుల రేసులో పేద బిడ్డలను విజేతలుగా నిలుపుతాం-డాక్టర్ సింధుర నారాయణ
నెల్లూరు: వి.ఆర్ పాఠశాల ప్రాంగణంలో సోమవారం మంత్రి పొంగూరు నారాయణ పెద్ద కుమార్తె డాక్టర్ సింధుర నారాయణ, విద్యార్థులతో కలిసి కాసేపు సరదాగా సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధుర మాట్లాడుతూ… కార్పొరేషన్ పరిధిలోని 23 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం నారాయణ గ్రూప్ తరఫున ఆరు కోట్ల రూపాయల సొంత నిధులతో ఏకంగా 10,000 హీరో బ్రాండ్ సైకిళ్లను పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు.
బాలికలు డ్రాపౌట్ కాకుండా:- మంత్రి నారాయణ తన చిన్నతనంలో విఆర్ హైస్కూల్లో చదువుకునేటప్పుడు మధ్యాహ్నం భోజనం కోసం నడుచుకుంటూ వెళ్లి ఎదుర్కొన్న రవాణా కష్టాలను గుర్తుచేసుకుని, నేటి తరంలో ముఖ్యంగా బాలికలు పాఠశాలల నుంచి మధ్యలోనే డ్రాపౌట్ కాకుండా సురక్షితంగా బడికి చేరుకోవాలనే విశాల ఆశయంతోనే ఈ సైకిళ్ల పంపిణీ ప్రణాళికను రూపొందించామని వివరించారు.
సిబిఎస్ఇ తరహాలో కేజీ నుంచి:- అలాగే నెల్లూరులోని మున్సిపల్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఉపాధ్యాయులకు ప్రత్యేక వర్క్ షాప్లు, బోధనా మెటీరియల్స్ అందిస్తూ మద్దతుగా నిలుస్తున్నామని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలను సిబిఎస్ఇ తరహాలో కేజీ నుంచి 12వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో నిర్వహించేలా అద్భుతంగా అప్గ్రేడ్ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

