నిర్మాణంలో ఉన్న ఆలయం సభా మండపం కూలి పోవడంతో ఆరుగురు మృతి
అమరావతి: మహారాష్ట్రలోని పర్భణీ జిల్లా, యశ్వాడి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న సభా మండపంలోని ఒక భాగం శనివారం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆరుగురు భక్తులు మరణించగా, పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న సుమారు 25 మందిని బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు.
శనివారం కావడంతో హనుమాన్ మందిరంలో ప్రత్యేక కీర్తనలు, అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారని, వీరంతా సభా మండపంలో కూర్చుని ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు . శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారనే కోణంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిర్మాణ లోపం వల్లే ఈ పైకప్పు కూలిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

