శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్
తిరుమల: భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో బాటు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సి వి ఎస్ ఓ మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ చైర్మన్-ఈవో స్వామి వారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు.
శ్రీ బేడీ ఆంజనేయ దర్శనం:- భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారిని కూడా దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి బోర్డు సభ్యులు, పలువురు రాష్ట్రస్థాయి-జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

