ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు-ఆకస్మిక తనిఖీలు చేసిన నెల్లూరు,తిరుపతి కలెక్టర్లు
నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నగరంలోని డీకే డబ్ల్యూ మహిళా కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 53404 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 81 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సందేహాల కోసం R.I.O కార్యాలయంలో 0861-2320312 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
తిరుపతి:– ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి ప్రారంభమైన నేపథ్యంలో తిరుపతి నగరంలోని వరదరాజ నగర్ లోని నారాయణ జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేసి ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి నగరంలోని జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లను, ఇన్విజిలేటర్లతో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో అమరావతి ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానంతో పర్యవేక్షణ జరుగుతోందని, క్యాంపస్ లో మెడికల్ సిబ్బంది క్యాంపు ఏర్పాటు, త్రాగునీరు, తగినంత వెలుతురు, బందోబస్తు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు వివరించారు.

