10 వేల మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు ప్రమోషన్లు-డిప్యూటీ సీఎం
77 డీడీఓలు ప్రారంభం..
అమరావతి: రాష్ట్రంలో పంచాయితీ రాజ్ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన 77 (DDO) డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును కార్యాలయాలని వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం, పంచాయరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ గురువారం చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆఫీసును ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
“వర్షించని మేఘం… శ్రమించని మేధావి” ఉన్నా, లేకపోయినా ఒక్కటే. అలాగే కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలనే రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించామని, ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకోని 10 వేల మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించగలిగామన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పదోన్నతి ఎంత కీలకమో తెలుసు కాబట్టే… ఎటువంటి పైరవీలకు తావు లేకుండా అర్హతే ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించామన్నారు.
“ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనపై ఇంత బలంగా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం మీ అందరి మద్దతు. మీరు ప్రభుత్వానికి అండగా నిలబడడంతోనే ఇదంతా సాధ్యమైంది. మన ఐక్యతే రాష్ట్రానికి బలం కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలు ఉన్నా… మనందరం “రాష్ట్రం బాగుండాలి- అరాచకాలు ఉండకూడదు ” అనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డాం. మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉండటం సహజం. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరతాయన్నారు.

