మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం
అమరావతి: సుప్రీం కోర్టు స్పష్టమైన అదేశాలతో, తమిళనాడు ప్రభుత్వం తలవంచింది. మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దీపతూణ్ వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని శనివారం ఆలయ పూజారులు వెలిగించారు. పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.వైద్యనాథన్, జస్టిస్ వి.పార్థిబన్ పర్యవేక్షణలో సరిగ్గా 5 గంటలకు ఆలయ అర్చకులు దీపం వెలిగించారు. దీంతో ఆ ప్రాంతమంతా మురుగున్ నినాదాలతో దద్ధరిల్లింది. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలిరాగా వారిని అదుపు చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొండపైకి భక్తులు వెళ్లకుండా CRPF బలగాలను భారీగా మోహరించారు. రాతిస్తంభంపై దీపం వెలగగానే భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు.ఈ సందర్భంగా భక్తులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కొండపైకి 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు.

