ఒంగోలులో ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీలు
మూడు విభాగాల్లో ఓవరాల్ ఛాంపియన్గా విశాఖపట్నం జిల్లా
500 మంది క్రీడాకారుల ప్రతిభా ప్రదర్శన..
జాతీయస్థాయి పోటీలకు విజేతలు..
అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలులోని డాక్టర్ పి. ఆనంద్ మినీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన 70వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్జిల్లా బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. అండర్-14 బాలురు, అండర్-17 బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
జాతీయస్థాయి పోటీలకు విజేతలు:- ఈ పోటీల్లో అండర్-14 విభాగంలో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ నెలలో ఢిల్లీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. అదేవిధంగా అండర్-17 బాలురు, బాలికల విభాగాల్లో ఎంపికైన క్రీడాకారులు మణిపూర్ రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు మరింత కష్టపడి సాధన చేసి జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని స్కూల్ గేమ్స్ కార్యదర్శులు శివశంకర్, రాజ్యలక్ష్మి ఆకాంక్షించారు.
విశాఖపట్నం జిల్లాకు ఓవరాల్ ఛాంపియన్షిప్:- మూడు విభాగాల్లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో విశాఖపట్నం జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ను సాధించారు. విజేతలకు పతకాలు అందజేయడంతో పాటు క్రీడాకారులను అభినందించారు.

