శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
జగన్మాతకు ప్రత్యేక పూజలు..
వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు..
అమరావతి: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రధానాలయంలోకి తీసుకుని వెళ్లారు.
సంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి చేరుకున్న ఆయన, అంతరాలయంలో శ్రీ అమ్మవారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు.అనంతరం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సంయుక్తంగా తమిళనాడు ముఖ్యమంత్రికి శ్రీ అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు మరియు దివ్య చిత్రపటాన్ని అందజేశారు.

