AP&TGDEVOTIONALOTHERS

గరుడసేవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్

గరుడసేవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా జరిగే గరుడవాహన సేవను పురస్కరించుకుని టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను చైర్మన్ బి.ఆర్. నాయుడు శనివారం పరిశీలించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య, జేఈవో డా. ఎ. శరత్, కె.వి. మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, బోర్డు సభ్యులు, ఇతర అధికారులతో కలిసి శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీలను చైర్మన్ పరిశీలించారు. గరుడసేవను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు కల్పిస్తున్న అన్నప్రసాదం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఆయన స్వయంగా పరిశీలించి, భక్తులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టి, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గరుడవాహన సేవను దర్శించేందుకు తరలివచ్చిన భక్తులతో మాడవీధుల్లోని గ్యాలరీలు నిండిపోవడంతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు, సిబ్బంది నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *