మళ్లీ 2027 సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి నా పాదయాత్ర చేస్తా-జగన్ మోహన్ రెడ్డి
ప్రజలను దగా చేసిన చంద్రబాబు..
స్థానిక ఎన్నికల్లోనూ చంద్రబాబు కుట్ర
అమరావతి: 2027 సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా పాదయాత్ర సాగుతుందని మాజీ సీ.ఎం,వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు.బుధవారం బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన సందర్బంగా మాజీ సీ.ఎం,జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎలా జరుగుతున్నాయి అని నా కంటే మీరే బాగా చెప్పగలరు. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రజలు గమనించారు. ప్రతి ఇంట్లో అదే చర్చ జరుగుతోందని తెలిపారు. చూస్తుండగానే రెండున్నర ఏళ్లు గడిచాయి. చూస్తుండగానే మరో ఏడాది కూడా గడిచిపోతుందన్నారు. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్, ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి పాలన ఇంటి గడప వద్దే అందించాం. పూర్తి పారదర్శకంగా పథకాలు అమలు చేశామన్నారు. చరిత్రలో, వ్యవస్థలో జరగని మార్పులు ఒక్క మన వైయస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయన్నారు.
ప్రజలను దగా చేసిన చంద్రబాబు:- చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ప్రతి ఇంటికి తన సంతకం, పవన్ సంతకంతో బాండ్లు పంపారు. మనం ఇచ్చిన పథకాలు మాత్రమే కాకుండా, మన కంటే ఇంకా మూడింతలు ఇస్తామని చెప్పారు.
స్థానిక ఎన్నికల్లోనూ చంద్రబాబు కుట్ర:- ఇలాంటి పరిస్థితిలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అవి జరుగుతాయో లేదో తెలియదు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అంటూ చంద్రబాబు డ్రామా చేస్తున్నాడు. నిజంగా దాన్ని కోర్టు కొట్టేస్తుందని తెలుసు. అందుకే ఆ సాకు చూపి, ఎన్నికలు వాయిదా వేయాలని కుట్ర చేస్తున్నాడు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని, జరగబోయే కురుక్షేత్రంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి. పోరాడాలన్నారు.

