ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నెల్లూరులో గణేష్ ఉత్సవాలు-మంత్రి ఆనం
నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు..
ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ వద్ద శాశ్వత గణేష్ ఘాట్ రూరల్ ఎమ్మెల్యే..
సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు..
నిమజ్జనం రోజున వేద పండితులతో ప్రత్యేక గంగా హారతి..
నెల్లూరు: నెల్లూరు నగరంలోని ఇరుకళ పరమేశ్వరీ ఆలయం సమీపంలోని గణేష్ ఘాట్ వద్ద వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని ఉత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, నిమజ్జన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
వినాయక చవితి ఉత్సవాలను ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నెల్లూరు నగరంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని మంత్రి ఆనం అధికారులను ఆదేశించారు. వేలాది మంది భక్తులు గణేష్ ఘాట్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి:- గణేష్ నిమజ్జనం రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. నిమజ్జనం కోసం వినియోగించే భారీ ట్రాలీలు, క్రేన్లను ఆర్టీఓ, పోలీస్ అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేసి ధృవీకరించాలని ఆదేశించారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు:- వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక వేదికపై నాదస్వర కచేరీలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, ఇతర ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి సుప్రసిద్ధ కళాకారులను ఆహ్వానించి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
నదీ హారతి:- ఈ నెల 18వ తేదీన గణేష్ నిమజ్జనం రోజున వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నదీ హారతి, ప్రత్యేక నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.నెల్లూరు నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడేలా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
వచ్చే ఏడాది నాటికి శాశ్వత గణేష్ ఘాట్:- ఈ ఏడాది గణేష్ ఘాట్ వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టినప్పటికీ, వచ్చే ఏడాది నాటికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ వద్ద రాష్ట్రంలో ప్రత్యేకంగా నిలిచేలా శాశ్వత గణేష్ ఘాట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గణేశోత్సవాలు ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించేలా అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి:- గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు.
ఈ సమావేశంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

