AP&TGDEVOTIONALNATIONALOTHERS

సాలకట్ల బ్రహ్మోత్సవాలు 14వ తేదిన రాత్రి 7 గంటలకు అంకురార్పణతో ప్రారంభం

తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల్లో శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సంవత్సరం అధికమాసం రావడంతో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటగా భాద్రపదంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అనంతరం అశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 14వ తేదిన రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం 15వ తేదిన సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేది నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా సాగే ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 15వ తేదిన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదే రోజు రాత్రి జరిగే పెద్దశేష వాహన సేవలోనూ చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం 16వ తేదిన ఉదయం నవీకరించిన ఎస్వీ మ్యూజియం, రిలయన్స్ సంస్థ విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులు, భక్తుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకే అత్యున్నత ప్రాధాన్యం కల్పిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేస్తూ, సాధారణ సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక ప్రివిలేజ్ దర్శనాలను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సామాన్య భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా స్వామివారిని దర్శించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *