AP&TG

సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌ ఫేజ్‌-2, స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

బహిరంగ సభలో మంత్రి నారాయణ..

350 కిలోమీటర్ల ట్రంక్‌ రోడ్లు,భూగర్భ మౌలిక వసతులు..

ఆంధ్రుల రాజధాని అమరావతికి సరికొత్త శోభ..

అమరావతి: ఆంధ్రుల రాజధాని అమరావతికి సరికొత్త శోభ వచ్చిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అమరావతి ముఖద్వారం ఉండవల్లి వద్ద సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌ ఫేజ్‌-2తో పాటు స్టీల్‌ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి నారాయణ ప్రసంగించారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌, నిర్మాణ వివరాలను ముఖ్యమంత్రికి మంత్రి వివరించారు.

350 కిలోమీటర్ల ట్రంక్‌ రోడ్లు,భూగర్భ మౌలిక వసతులు:- అమరావతిలో సుమారు 350 కిలోమీటర్ల మేర ట్రంక్‌ రోడ్లను నిర్మించడంతో పాటు సమగ్ర భూగర్భ మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుకు అనుసంధానంగా విద్యుత్‌, గ్యాస్‌, టెలిఫోన్‌, తాగునీటి సరఫరా తదితర సేవలను భూగర్భంలోనే ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. డ్రైనేజీ, పునర్వినియోగ నీటి పైపులైన్లు, వర్షపు నీటి కాలువలు వంటి మౌలిక వసతులను కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

రవాణా వ్యవస్థలో కీలకంగా స్టీల్‌ బ్రిడ్జిలు:-  సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుకు అనుసంధానంగా నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జిలు అమరావతి రవాణా వ్యవస్థలో కీలకంగా నిలుస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. ఒక వంతెన జాతీయ రహదారితో అనుసంధానం కానుండగా, మరొక వంతెన మంగళగిరి రోడ్డు వైపు అనుసంధానమవుతుందని చెప్పారు. మంగళగిరి వైపు వెళ్లే వంతెన ఇప్పటికే పూర్తయిందని పేర్కొన్నారు.

సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌ ఫేజ్‌-2, స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభంతో అమరావతి రవాణా మౌలిక వసతుల్లో మరో కీలక ముందడుగు పడిందన్నారు. రాజధాని నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి అమరావతిని రాష్ట్రానికి ఆర్థిక, పరిపాలనా, మౌలిక వసతుల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *