మానవ-వన్యప్రాణి సంఘర్షణ లేకుండా జీవనం అత్యున్నతమైనది-ఉప ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ఏనుగుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం..
కుంకీ ఏనుగుల రాకతో ఆంధ్రప్రదేశ్ లో అద్భుత ఫలితాలు..
రాష్ట్రంలోనూ ఏటా రెండు కుంకీ ఏనుగులకు శిక్షణ ఇచ్చే విధంగా..
అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో..
విశాఖపట్నం: ‘ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులతో తీవ్రమైన సమస్యలుండేవి. సుమారు 132 నుంచి 142 ఏనుగులు గుంపులుగా ఏజెన్సీ ప్రాంతంలో కల్లోలం సృష్టించేవి. చిత్తూరు జిల్లా పలమనేరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల గుంపులు పంటపొలాల మీద పడి పంటలను ధ్వంసం చేయడం, అడ్డొచ్చే వారిపై దాడులు చేయడంతో ప్రజల్లో భయందోళనలు నెలకొన్నాయి. నేను అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల బాధ్యతలను తీసుకున్న తర్వాత మొదటిగా ప్రజలకు, ఏనుగులతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం మీదనే దృష్టి సారించాన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మదపుటేనుగులను నిరోధించేందుకు నాలుగు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వ సహాయంతో తీసుకొచ్చి, వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మానవులు – వన్య ప్రాణుల మధ్య ఘర్షణలను నివారించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వీటివల్ల ఏజెన్సీ ఏరియాల్లో మంచి ఫలితాలొస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో ప్రత్యేకంగా నిర్వహంచిన జాతీయ స్థాయి సెమినార్ లో కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తో కలసి పాల్గొన్నారు.
సంరక్షణ కేంద్రాలు 26 నుంచి 33కు పెరిగాయి:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘ఏనుగులు పర్యావరణ సమతుల్యతకు వారధిగా నిలుస్తాయి. దేశ వన్యప్రాణి వారసత్వానికి అవి చిహ్నాలు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏనుగుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.2014 నుంచి దేశంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రాలు 26 నుంచి 33కు పెరిగాయి. కారిడార్ల రక్షణ, ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ బలోపేతం, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.150 ఏనుగుల కారిడార్లను దేశవ్యాప్తంగా గుర్తించడం ద్వారా ఏనుగుల ఆవాసాలకు ఇబ్బంది లేకుండా ఉంది. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరిస్తోంది. ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
70 శాతం తగ్గిర మరణాలు:- కుంకీ ఏనుగులు వచ్చిన తరువాత అటవీ సరిహద్దు ప్రాంతాల్లో మానవ మరణాలు 70 శాతం తగ్గింది. పంట నష్టం కూడా తగ్గింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూడా సొంత కుంకీ ఏనుగులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాం. ఇప్పటికే ఒక శిక్షణ పొందిన కుంకీ ఏనుగు జయంత్ పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఉంది. ప్రతి ఏటా రెండు కుంకీ ఏనుగులకు శిక్షణ ఇవ్వాలనేది మా ప్రణాళిక.
హనుమాన్ ప్రాజెక్టుతో మంచి ఫలితాలు:- మానవులు – వన్య ప్రాణుల మధ్య నెలకొన్ని ఘర్షణలను పూర్తిగా నిరోధించేందుకు, వన్య ప్రాణులను రక్షణ కోసం రూపొందిన హనుమాన్ ప్రాజెక్టుతో మంచి ఫలితాలు వస్తున్నాయి. వేగవంతమైన స్పందన, సాంకేతికత, వణ్య ప్రాణులతో కలిగే నష్ట నివారణ కోసం సమగ్ర మానవ-వన్యప్రాణుల సంఘర్షణ నిర్వహణ వ్యవస్థ అయిన H.A.N.U.M.A.N (హనుమాన్) ప్రాజెక్టును 2026, మార్చిలో ప్రారంభించాం. 93 స్పందన వాహనాలు, 7 వన్యప్రాణి అంబులెన్స్ లను ఈ ప్రాజెక్టులో సిద్ధం చేశాం. ఇప్పటి వరకు 200కు పైగా వన్యప్రాణులు రక్షించడమే కాకుండా, 30కి పైగా వన్యప్రాణులను తరలింపు కార్యక్రమం జరిగింది.
ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 జెయింట్ స్టెప్స్ పుస్తకావిష్కరణ:- అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా అటవీ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన “ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 జెయింట్ స్టెప్స్” పుస్తకాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం దేశవ్యాప్తంగా 21,450 పాఠశాలల్లో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో 20 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు.

