AP&TGNATIONAL

31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం-దక్షిణాది ప్రగతికి సమష్టి అడుగులు

రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్‌ భారత్‌ లక్ష్యం..

2047 నాటికి 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దక్షిణాది రాష్ట్రాలు..

గోదావరి–కావేరి అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా వరద జలాల..

కుప్పం మీదుగా బుల్లెట్‌ రైలు..

దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి మౌలిక వసతుల ప్రతిపాదనలు..

31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు..

అమరావతి: రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగితే భారతదేశ అభివృద్ధికి మరింత బలమైన చోదకశక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. 2047 నాటికి దక్షిణ భారత్ 10 ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉందన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 24 అంశాలతో కూడిన ఎజెండాపై సమావేశంలో చర్చించారు.

బుల్లెట్‌ రైలు కారిడార్‌ను అభివృద్ధి:- ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య  పరస్పర సహకారం సాధించటమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్‌ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం ఇస్తుందని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌, డ్రై పోర్టుల ఏర్పాటు, దక్షిణ గ్రిడ్‌ను జాతీయ విద్యుత్‌ గ్రిడ్‌తో అనుసంధానం చేయడం, యూనివర్సిటీలు, ఇతర స్కిల్లింగ్ సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఏ రాష్ట్రం ఒంటరిగా ఉండకుండా పరస్పర సహాయానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు.

తిరుపతి నుంచి అయోధ్య వరకు తీర్ధయాత్ర సర్క్యూట్:- దక్షిణాది ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉత్తర భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధానిస్తూ ప్రత్యేక వారసత్వ, పర్యాటక, తీర్థ యాత్ర సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. తిరుపతి, శ్రీశైలం, కాంచీపురం, మధురై, రామేశ్వరం, మైసూరు వంటి ప్రాంతాలను వారణాసి, అయోధ్య, చార్‌ ధామ్‌ ప్రాంతాలతో అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం కల్పించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి ప్రతిపాదన చేశారు.

దేశ స్థూల ఉత్పత్తిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల వాటా ప్రస్తుతం 31 శాతంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ 30–35 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్లు తమిళనాడు 2.6, కర్ణాటక 1 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థలుగా లక్ష్యాలు నిర్దేశించుకున్నాయని సమష్టిగా దక్షిణ భారత్ లోని రాష్ట్రాలన్నీ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక శక్తిగా ఎదుగుతాయని ముఖ్యమంత్రి వివరించారు.

విభజన హామీల పరిష్కారం:- ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్‌ అంశాలను చంద్రబాబు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచినా షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన పూర్తికాలేదని పేర్కొన్నారు.

నీటి భద్రతకు గోదావరి–కావేరి అనుసంధానం:- భవిష్యత్‌ నీటి భద్రతకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా వంటి 40 నదులు 28 జిల్లాలకు సాగునీటిని అందిస్తున్నాయని తెలిపారు.  గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీలకు పైగా మిగులు వరద జలాలను కావేరి బేసిన్‌కు తరలించే ప్రతిపాదనను సీఎం కేంద్రం ముందు ఉంచారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. గంగా–కావేరి అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు.

నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం:- గంగా నది మిగులు జలాలను దక్షిణాది ప్రాంతాలకు తరలించడం ద్వారా తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల మధ్య సమన్వయానికి ప్రత్యేక దక్షిణాది నదీ బేసిన్ల సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, డీపీఆర్‌లు, అనుమతులను కాలపరిమితిలో పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో పరస్పర విశ్వాసం, రాష్ట్రాల మధ్య సహకారం, సమష్టి అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ పనిచేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలు త్వరితగతిన అమలు అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేరళ సీఎం వి.డి. సతీషన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి  సహా ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *