ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల కారణంగా నామినేషన్లు వేయలేకపోతున్నామంటూ అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో కోర్టు స్పందించింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రధాన ఆదేశాలు..
తుది జాబితా వాయిదా:- పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 25, 2026 వరకు వాయిదా వేయాలని SECని ఆదేశించింది.
నామినేషన్ల గడువు పొడిగింపుపై పరిశీలన:- అభ్యర్థులు ఇచ్చిన వినతి పత్రాలు, డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించి, శాంతిభద్రతల సమస్య ఉన్న పట్టణాల్లో నామినేషన్ గడువు పొడిగించాలా వద్దా అనేది SEC నిర్ణయించాలి.
రేపటిలోగా నిర్ణయం, 48 గంటల గడువు:– SEC అక్టోబర్ 22, 2026 లోగా నిర్ణయం తీసుకోవాలి. గడువు పొడిగిస్తే, నిర్ణయం ప్రచురించినప్పటి నుంచి అభ్యర్థులకు నామినేషన్ వేయడానికి కనీసం 48 గంటల సమయం ఇవ్వాలి
పోలీసు భద్రత, సీసీటీవీ:- నామినేషన్ వేసే అభ్యర్థులకు తగిన పోలీసు బందోబస్తు, సీసీటీవీ కవరేజ్, రక్షణ కల్పించాలని DGPకి ఆదేశం. దీనిపై నివేదిక సమర్పించాలి.
స్వేచ్ఛాయుత ఎన్నికలు:- అర్హులైన అభ్యర్థులందరికీ స్వేచ్ఛగా, న్యాయంగా పోటీ చేసే అవకాశం కల్పించేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని SECకి సూచన. తదుపరి విచారణ: SEC తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలి. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 26వ తేదిన జరుగనున్నది.
కమిషనర్ అనిల్ చంద్ర పునేత:- స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం లభించని, తగిన భద్రత లేక నామినేషన్లు సమర్పించలేకపోయిన అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత అధికారులను అదేశించారు.బుధవారం ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

