AP&TGPOLITICS

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు..

29 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు..

విభజనకు ముందు 13 జిల్లా పరిషత్‌ల పరిధిలో..

35,333 పోలింగ్ కేంద్రాలు..

రాష్ట్రంలో మొత్తం 663 రెవెన్యూ మండలాలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 14వ తేది ఎన్నికల షెడ్యూల్‌లో ప్రకటించినట్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 28 జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో 659 జెడ్పీటీసీ స్థానాలకు, 659 మండల ప్రజా పరిషత్‌ల పరిధిలో 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 663 జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు, 9,858 ఎంపీటీసీ స్థానాల్లో 29 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు.

ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ప్రజా పరిషత్‌లకు 28 మంది రిటర్నింగ్ అధికారులు, 659 మండల ప్రజా పరిషత్‌లకు 687 మంది రిటర్నింగ్ అధికారులు, అదనంగా 1,374 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం 35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,41,332 మంది ఇతర పోలింగ్ అధికారుల సేవలను వినియోగించుకోనున్నారు.

అభ్యర్థుల డిపాజిట్, ఎన్నికల వ్యయ పరిమితి:- ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిపాజిట్ మొత్తం రూ.1,500 కాగా, ఇతర అభ్యర్థులకు రూ.3,000గా నిర్ణయించారు.

జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు డిపాజిట్ రూ.3,000 కాగా, ఇతర అభ్యర్థులకు రూ.6,000గా నిర్ణయించారు.

ఎన్నికల వ్యయ పరిమితి:- ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.4 లక్షలు, జెడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు.

కమిషనర్ మైలవరపు వెంకట రామకృష్ణ తేజ:- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు వెంకట రామకృష్ణ తేజ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటి వివరాల ప్రచురణ, రిజర్వేషన్ల ఖరారు, గెజిట్ ప్రచురణ వంటి కీలక ప్రక్రియలను పూర్తిచేసినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ఈసారి మొత్తం 28 జిల్లా పరిషత్‌ల పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. గతంలో జిల్లాల విభజనకు ముందు 13 జిల్లా పరిషత్‌ల పరిధిలో మాత్రమే ఎన్నికలు జరిగాయని వివరించారు.

రాష్ట్రంలో మొత్తం 663 రెవెన్యూ మండలాలు ఉన్నాయని, ప్రతి రెవెన్యూ మండలాన్ని ఒక జెడ్పీటీసీ నియోజకవర్గంగా పరిగణిస్తారని తెలిపారు. మచిలీపట్నం, ఆదోని మండలాల విభజనతో పాటు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం కావడంతో ఈసారి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు.

అమరావతి ప్రాంతంలోని నాలుగు మండలాలను మినహాయించి మిగిలిన 659 మండలాల్లో ఎన్నికల ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. అమరావతి ప్రాంతంలోని మండలాల విషయంలో భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయం మేరకు స్థానిక సంస్థల ఏర్పాటు చేపట్టనున్నట్లు వివరించారు.

659 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల (ఎంపీటీసీ) స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపారు.

ఎన్నికల ముఖ్య వివరాలు:- ఎన్నికల్లో మొత్తం 2,81,34,518 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు. వీరిలో 1,38,53,807 మంది పురుష ఓటర్లు, 1,42,79,285 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు వివరించారు.

35,333 పోలింగ్ కేంద్రాలు:- ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,333 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు 659 మండల కేంద్రాలతో పాటు 28 జిల్లా కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డా. ఏ. మల్లిఖార్జున, ఐజీ బి. రాజకుమారి ఉన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *