మలేషియాలో ఘన వ్యర్థాల నిర్వహణ విధానాల అధ్యయనంలో మంత్రి నారాయణ
అమరావతి/మలేషియా: ఘన వ్యర్థాల నిర్వహణలో మలేషియా సాధించిన పురోగతి, సాంకేతిక వినియోగం, సమర్థవంతమైన నిర్వహణ వ్యవస్థలు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడతాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మలేషియా చేరుకున్న మంత్రి నారాయణ సెలంగార్ రాష్ట్రంలోని KDEB వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణకు అక్కడి అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. గృహాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సేకరించడం, రవాణా చేయడం, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడం వంటి అంశాలను వివరించారు. ముఖ్యంగా వ్యర్థాల విభజన, సాంకేతిక వినియోగం, రీసైక్లింగ్ వ్యవస్థలు, ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న విధానాలను తెలుసుకున్నారు.
రీసైక్లింగ్ ప్రక్రియలపై:- క్షేత్రస్థాయిలో పలు వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను సందర్శించారు. బయో మెడికల్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాంట్ల పనితీరును పరిశీలించారు. వ్యర్థాల శుద్ధి, పర్యావరణ పరిరక్షణ, శక్తి ఉత్పత్తి, రీసైక్లింగ్ ప్రక్రియలపై అక్కడి నిపుణులతో చర్చించారు.
అనంతరం సెన్విరో ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించిన మంత్రి, ప్రమాదకర-పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న అత్యాధునిక సాంకేతిక విధానాలను పరిశీలించారు. ఈ పర్యటనలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కూడా మంత్రితో పాటు పాల్గొన్నారు. మలేషియాలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, వాటిలో రాష్ట్రానికి అనుకూలమైన విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.

