శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన బంగారు ఆభరణాల సమర్పణ
సీఎం చంద్రబాబు సమక్షంలో 121 కిలోల బంగారు ఆభరణాలు..
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ అపూర్వ ఘట్టం జరిగింది. బంగారు ఆభరణాలతో పాటు విలువైన వజ్రాలు కూడా ఉన్నాయని, వీటి మొత్తం విలువ సుమారు రూ.206 కోట్లు ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

అనంతరం జైన్ దంపతులతో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారిపై అపారమైన భక్తి, విశ్వాసాలతో దేవుని ఆదేశం మేరకు ఈ ఆభరణాలను సమర్పించామని దంపతులు చెప్పినట్లు వివరించారు. ఈ అపూర్వ కార్యక్రమంలో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
తిరుమల అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందానికి ప్రతీక అని, ఇక్కడ లభించే దివ్యానుభూతి మరెక్కడా దొరకదని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీవారి వైభవాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. ప్రతిరోజూ స్వామివారికి సుమారు 120 కిలోల బంగారు ఆభరణాలు అలంకరిస్తారని తెలిపారు.
శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి నేటి వరకు శ్రీవారిపై భక్తి, విశ్వాసాలు నిరంతరం కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులతో పాటు మైసూరు, మరాఠా పాలకులు ఆలయ అభివృద్ధికి, స్వామివారికి ఆభరణాలు, కానుకలు, ఆస్తుల సమర్పణకు విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు.
విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు తిరుమల ఆలయానికి అనేక ఆభరణాలను సమర్పించారని, ఆయన అందించిన రత్నకిరీటం, పీతాంబరానికి ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉందని వివరించారు. పూర్వకాలంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగినప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో ఎవరూ అలాంటి సాహసానికి ఒడిగట్టలేదని వ్యాఖ్యానించారు. శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించేందుకు అనేక మంది కృషి చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. జైన్ దంపతులు సమర్పించిన భారీ విరాళం తిరుమల చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోతుందని అన్నారు.

