లైసెన్స్ సస్పెన్షన్లో ఉన్నా డ్రైవర్లకు ప్రత్యామ్నాయ విధులు-APSRTC
జీతాల చెల్లింపునకు కీలక నిర్ణయం..
డ్రైవర్ తప్పు లేదని నిర్ధారణ అయిన సందర్భాల్లో..
అమరావతి: రోడ్డు ప్రమాదాల్లో పాల్గొన్నప్పటికీ శాఖాపరమైన విచారణలో తప్పు లేదని తేలిన డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఊరటనిచ్చింది. డ్రైవింగ్ లైసెన్సులు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ, అవి పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించి జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు APSRTC జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్, ఐఎఫ్ఎస్ నవంబర్ 24న PD-39/2026 నోటిఫికేషన్ జారీ చేశారు. సంస్థలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, DPTOలు, డిపో మేనేజర్లు, యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
డ్రైవర్ తప్పు లేదని నిర్ధారణ అయిన సందర్భాల్లో:- ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల్లో పాల్గొన్న డ్రైవర్ల లైసెన్సులను మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం సంబంధిత లైసెన్సింగ్ అధికారులు సస్పెండ్ చేస్తున్నారు. దీంతో డ్రైవర్లు విధులకు దూరమై జీతాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో శాఖాపరమైన విచారణలో డ్రైవర్ తప్పు లేదని నిర్ధారణ అయిన సందర్భాల్లో వారికి ప్రత్యామ్నాయ విధులు కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది. అర్హులైన డ్రైవర్ల లైసెన్సుల పునరుద్ధరణ కోసం డిపో మేనేజర్లు, యూనిట్ అధికారులు సంబంధిత RTO అధికారులకు లేఖలు పంపాలి. అప్పటివరకు డ్రైవర్లను వారి సాధారణ విధులకు భిన్నంగా ఇతర విధుల్లో తాత్కాలికంగా నియమించాలి.
పూర్తి జీతాలు చెల్లించాలని:- మూడు నెలల వరకు లైసెన్స్ సస్పెన్షన్ ఉన్న డ్రైవర్లకు ప్రత్యామ్నాయ విధులు కల్పించేందుకు DPTOలు అనుమతి ఇవ్వవచ్చు. మూడు నెలలకు మించి సస్పెన్షన్ ఉన్న సందర్భాల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు లేదా జోనల్ అధికారులు అనుమతి మంజూరు చేయాలి. ప్రత్యామ్నాయ విధులు నిర్వహించే కాలానికి పూర్తి జీతాలు చెల్లించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. డ్రైవర్లకు న్యాయం చేయడంతో పాటు వారి సేవలను సంస్థ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని APSRTC యాజమాన్యం పేర్కొంది.

