డీస్పీ అవినీతి ఆస్తులు దాదాపు రూ.200ల కోట్లు
హైదరాబాద్: ఐదు కాదు పది కాదు దాదాపు రూ.200ల కోట్లు ఆస్తులు ఒక DSP స్థాయి అధికారి విశ్వరూపం. వివరాల్లోకి వెళ్లితే… హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి అవినితి చిట్లా చూసి ఏసిబీ అధికారులకు సైతం దిమ్మెతిరిగింది. భీమ్‌రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని ఏసీబీ అధికారులు బద్దలు కొట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో గురువారం హైదరాబాద్, మహబూబ్‌నగర్, కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూడటం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. గతంలో గ్యాంగ్‌స్టర్ నయీం కేసులోనూ భీమ్‌రెడ్డి పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. భీమ్‌రెడ్డి నివాసం నుండి 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.3.6 లక్షల నగదు, 23 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆస్తుల వివరాల రహస్య డైరీ:– సోదాల్లో భాగంగా భీమ్‌రెడ్డి ఇంట్లో దొరికిన ఒక చిన్న నోట్‌బుక్ (డైరీ) ఏసీబీ అధికారులకు కీలక ఆధారంగా మారింది. తన అక్రమాస్తులను ఎవరెవరి పేరిట, ఎక్కడెక్కడ పెట్టారో ఆయన అందులో స్పష్టంగా రాసిపెట్టుకున్నారు. దీని ఆధారంగా మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి నివాసంలో జరిపిన తనిఖీల్లో రూ.40 లక్షల నగదు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మణికొండ, తెల్లాపూర్, వెస్సెల్లా మెడోస్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో విల్లాలు, వాణిజ్య భవనాలు, ప్లాట్లతో పాటు వికారాబాద్, జహీరాబాద్, ముచ్చింతల్‌లో భారీగా వ్యవసాయ భూములను ఏసీబీ గుర్తించింది.
కర్ణాటకలో కూడా ఆస్తులు:– తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో ఎకరం భూమితో పాటు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో మరో 44 ఎకరాల వ్యవసాయ భూమిని బినామీల పేరిట కొనుగోలు చేసినట్లు తేలింది. ఇంత పెద్ద మొత్తంలో ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు కూడపెట్టడం వెనుక భీమ్‌రెడ్డి మరెవరికైనా బినామీగా ఉన్నారా అనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన 10 సార్లు థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లు కూడా అధికారులు గుర్తించి, ఆయనను అరెస్ట్ చేశారు.అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్లు 13(1)(b)-13(2) కింద ఏసీబీ (ACB) అక్రమ ఆస్తుల కేసును నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

