పాకిస్థాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది భారత్
సింధు జలాల ఒప్పందం…
అమరావతి: 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో, పాకిస్తాన్ తో వున్న సింధు జలాల ఒప్పందంను భారత్ నిలిపివేసిందని,సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ తన మద్దతును తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఐడబ్ల్యూటీ అమలును నిలిపివేయాలనే తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.మీడియా సమావేశంలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్,అంతర్జాతీయ వేదికలపై చేస్తున్న ప్రచారం, బెదిరింపు వ్యాఖ్యలు తమ నిర్ణయాన్ని ఏమాత్రం ప్రభావితం చేయవని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ శాశ్వతంగా స్వస్తి పలకాలని, అప్పటివరకు భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని కుండబద్దలు కొట్టారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినంత కాలం సింధు జలాల ఒప్పంద అమలును నిలిపివేస్తాం అన్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన నేపథ్యంలో, ఆ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం భారత్‌కు ఎలాంటి బాధ్యతలూ వర్తించవని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సార్వభౌమ దేశంగా తీసుకున్న నిర్ణయాలపై ఎలాంటి మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌కూ అధికారం లేదని కూడా స్పష్టం చేసింది.

