పారిశ్రామిక ప్రాంతాల వద్ద తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం-ముఖ్యమంత్రి చంద్రబాబు
18వ ఎస్ఐపీబీ సమావేశంలో..
అమరావతి: పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఏపీలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ఎకో సిస్టంను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమలు, కంపెనీలను ధనికులే స్థాపించగలరనే భావన పోయేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 18వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఈ అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలి. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పేద, మధ్య తరగతి వారికి ఉద్యోగాలు కల్పించడమే కాదు… సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదేశించారు.

