యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ విధించే అంశంపై ఇప్పుడే చెప్పలేం-ఆర్‌బీఐ గవర్నర్
ఖర్చును ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది..
రూ.2,000 కు పైబడిన వ్యాపార చెల్లింపులపై మాత్రమే..
అమరావతి: UPI (యూపీఐ) లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ విధించే అంశంపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటు చర్య అవుతుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యనించారు.డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలంటే దాని నిర్వహణ వ్యయాన్ని ఎవరో ఒకరు భరించాల్సిందేనని, అయితే ఆ భారం నేరుగా సాధారణ వినియోగదారులపైనే పడుతుందని ఇప్పుడే చెప్పలేమన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మల్హోత్రా మాట్లాడుతూ, యూపీఐపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ అంశం ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు.
ఖర్చును ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది:- ‘వ్యవస్థ నిర్వహణకు ఖర్చులు వుంటాయని, సదరు ఖర్చును ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుందన్నారు.అయితే ఆ ఖర్చు సాధారణ వినియోగదారుడే చెల్లిస్తాడని చెప్పలేమని, పరోక్షంగా ఆర్థిక వ్యవస్థలోనే ఆ వ్యయం భరించే అవకాశం కూడా ఉంటుంది’ అని మల్హోత్రా వెల్లడించారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్’ చట్ట సవరణ బిల్లు ద్వారా యూపీఐ, రూపే వంటి డిజిటల్ చెల్లింపులపై భవిష్యత్తులో ఎండీఆర్ విధించే అవకాశానికి చట్టపరమైన వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
రూ.2,000 కు పైబడిన వ్యాపార చెల్లింపులపై మాత్రమే:- రోజువారీ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే స్పష్టంచేశాయి. రూ.2,000 కు పైబడిన వ్యాపార చెల్లింపులపై మాత్రమే ఎండీఆర్ విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారని, పాలు, కూరగాయలు, కిరాణా వంటి చిన్న మొత్తాల యూపీఐ చెల్లింపులు యథాతథంగా ఉచితంగానే కొనసాగే అవకాశముందని తెలిపాయి. యూపీఐ విషయంలో కూడా తుది విధానం ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆర్‌బీఐ కూడా ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రతిపాదనను ప్రకటించలేదని గవర్నర్ స్పష్టంచేశారు.

