గుంటూరు జీజీహెచ్ లో అత్యాధునిక పెట్ స్కాన్’ సిద్ధం-మంత్రి సత్యకుమార్
ఎటువంటి ఫీజు తీసుకోరు..
అమరావతి: ప్రైవేట్ కార్పొరేట్ అసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్ (క్యాన్సర్ గుట్టును పసిగట్టే) గుంటూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో సిద్ధమైంది. పేద, మధ్యతరగతి రోగులకు క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అత్యుత్తమ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లోనే తొలిసారిగా గుంటూరు జీజీహెచ్లో ఆధునిక సౌకర్యాల మధ్య ఈ పెట్ స్కాన్ ను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. క్యాన్సర్ వైద్యంలో ఇదోక మైలురాయి కాబోతుంది. ఇందుకోసం సుమారు రూ.18 కోట్ల వరకు కూటమి ప్రభుత్వం వ్యయంచేసింది. పెట్ సి.టి స్కాన్ ద్వారా క్యాన్సర్ వైద్య సేవలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు.
ఉచితం:- ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ కార్పొరేటు ఆసుపత్రుల్లో పెట్ స్కాన్ సదుపాయం అందుబాటులో ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, ఇతరచోట్ల అందుబాటులో ఉన్న ఈ పెట్ స్కాన్ సౌకర్యాన్ని రోగుల ఆరోగ్య సంరక్షణ దృష్టిలో పెట్టుకుని గుంటూరు జీజీహెచ్ లో అందుబాటులోనికి తెచ్చామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. కార్పొరేట్ అసుపత్రుల్లో పెట్ స్కాన్ ద్వారా పరీక్షలు చేయించుకునే వారి నుంచి సగటున రూ.20వేల వరకు తీసుకుంటున్నారు. గుంటూరు జీజీహెచ్ ఆవరణలో ఉన్న నాట్కో క్యాన్సర్ కేంద్రంలో పరీక్షలు చేయించుకునే వారి నుంచి ఎటువంటి ఫీజు తీసుకోరు.

